అబార్షన్.. అవాంఛిత గర్భాన్ని వద్దనుకొని, తీయించుకునే పద్ధతి! ఉన్నత చదువులు, కెరీర్‌లో స్థిరపడాలనుకోవడం, ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నాలు.. ఇలా కారణాలు ఏవైనా.. అనుకోకుండా వచ్చే గర్భాన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు దాని వల్ల వచ్చే ఇబ్బందుల్ని కూడా అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి తల్లయ్యే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోవడం దాకా ఎన్నో రకాల సమస్యలు ఎదురుకావచ్చు.
తను ఎప్పుడు తల్లి కావాలో నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఉన్నా.. అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవాలనుకునే విషయంలో మాత్రం ఎక్కడ, ఎప్పుడు, ఎవరి సమక్షంలో, ఏ పద్ధతిలో అబార్షన్ చేయించుకోవాలనేది ఎంటీపీ చట్టం తెలియజేస్తుంది. ఎందుకంటే.. సరైన పద్ధతుల్లో అబార్షన్ చేయించుకోని వాళ్లలో చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి సుమారు నాలుగు కోట్ల అబార్షన్లు జరుగుతున్నాయి. అలా చేయించుకునేవారిలో కొందరు జీవిత కాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మన దేశాన్ని మాత్రమే చూస్తే ఏడాదికి ఒకటిన్నర కోట్ల అబార్షన్లు జరుగుతుంటే.. కోటి మంది ప్రమాదకర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకుంటున్నారు. దాంతో అత్యధికంగా దాదాపు ఎనభై లక్షల మంది అబార్షన్ల వల్ల వచ్చే ఇతర సమస్యలతో జీవితాంతం బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గర్భాన్ని కొనసాగించడం వల్ల తల్లికిగాని, బిడ్డకు గాని సమస్యలు ఎదురవుతాయి అన్నప్పుడే అబార్షన్ చేయించుకోవాలి.. సాధ్యమైనంత వరకు అవాంఛిత గర్భం రాకుండా చూసుకోవడమే మంచిది. ఒకవేళ వచ్చినా సురక్షిత విధానంలోనే అబార్షన్ చేయించుకోవాలి.
పర్యవేక్షణ అత్యవసరం
సాధారణంగా గర్భం ధరించిన రెండు, మూడు నెలల లోపు అబార్షన్ చేయించుకోవచ్చు. ఒకవేళ ఇరవై వారాలు అంటే ఐదు నెలలు దాటిన తర్వాత కూడా శిశువుకు ఏదైనా సమస్య ఉండి అది తల్లి ప్రాణాలకు హాని చేస్తుందంటే అబార్షన్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు రెండో అభిప్రాయం కోసం మరో గైనకాలజిస్టు సలహా కూడా తీసుకోవడం చాలా అవసరం. ఇలా నెలల్ని బట్టి మందులు లేదా శస్త్ర చికిత్స ద్వారా అబార్షన్ చేస్తారు. తొమ్మిది వారాల లోపు అయితే మందులు వేసుకోవచ్చు. అయితే ముందు డాక్టర్ పరీక్ష చేసి హెమోగ్లోబిన్ శాతం, ఇతర సమస్యలు, అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా గర్భం గర్భాశయంలోనే ఉందా? లేదా? తదితర విషయాలను తేల్చుకుంటారు. అవసరమైన పక్షంలో ఆర్‌హెచ్ రక్తపరీక్ష కూడా చేయించుకోమని సూచించవచ్చు. బిడ్డ ఆర్‌హెచ్ నెగెటివ్ అని తేలితే ఇంకొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటే మాత్రలను వాడటం వల్ల తల్లి ప్రాణానికి ముప్పు రావచ్చు. కాబట్టి వీటన్నింటినీ పరిగణించి మందుల్ని ఎంత ఇవ్వాలనేది వైద్యులు నిర్ణయిస్తారు.. వీటిని వేసుకోవడం సులువైనా వీటివల్ల కొన్ని సమస్యలు మాత్రం ఎదురవుతాయి. గర్భ విచ్ఛిత్తికి వాడే మాత్రల వల్ల నూటికి పది, పదిహేను శాతం మందిలో గర్భాశయంలో చిన్న, చిన్న ముక్కలు మిగిలిపోతాయి. అలాంటప్పుడు రక్తస్రావం ఎక్కువగా కావడం, నొప్పి లాంటి సమస్యలు వస్తాయి. దీనికోసం శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.
గర్భసంచి లోపల చిన్న, చిన్న ముక్కలు మిగిలిపోయినప్పుడు అబార్షన్ పూర్తి అయినట్టుగా పరిగణించలేం. కాబట్టి కొన్ని భాగాలకు చీము పడుతుంది. ఇన్ఫెక్షన్ కటి వలయానికి కూడా వ్యాపిస్తుంది. ఆ ఇన్ఫెక్షన్‌ను గుర్తించడానికి రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. సమస్య ఉంటే వ్యాక్యూమ్ యాస్పిరేషన్ పద్ధతిలో గర్భాశయాన్ని శుభ్రం చేస్తారు. కొన్ని సార్లు గర్భాశయంలో రక్తం నిలిచిపోయి అది ఒక సంచిలా తయారవుతుంది. అలాంటప్పుడు రక్తాన్ని తొలగించి గర్భాశయాన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తయితే ఫాలోఫియన్ ట్యూబులు, పొట్ట, కటి వలయం, అండాశయాల్లాంటి భాగాలకు కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించొచ్చు. దాంతో ఆ భాగాల్లో చీము పడుతుంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఫెలోఫియన్ ట్యూబులు మూసుకుపోతాయి. దీని వల్ల ఆ తర్వాత తిరిగి గర్భం ధరించడం కష్టంగా మారుతుంది. కొన్నిసార్లు శాశ్వతంగా పిల్లలను కనే అవకాశాన్నీ కోల్పోవచ్చు. ఆ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా కొనసాగి, క్రానిక్ పీఐడీగా జీవితాంతం సమస్యలు వేధించే అవకాశాలూ ఎక్కువే.. ముఖ్యంగా విపరీతమైన కడుపు నొప్పి, వైట్ డిశ్ఛార్జి, కలయిక సమయంలో నొప్పి.. నెలసరి తరచుగా, ఎక్కువగా అవుతుండటం వంటివి బాధిస్తూ ఉంటాయి.
సర్జరీని వ్యాక్యూమ్ యాస్పిరేషన్ పద్ధతిలో చేస్తారు. జననేంద్రియ భాగం నుంచి సన్నని ట్యూబ్ లాంటి దానిని ప్రవేశ పెట్టి నెగెటివ్ ప్రెషర్‌తో గర్భాన్ని తొలగిస్తారు. దీనివల్ల వచ్చే నొప్పిని నివారించేందుకు మత్తు ఇస్తారు. సర్జరీ జరిగిన రోజే ఇంటికి వెళ్లి పోవచ్చు. అదే నెలలు పెరిగే కొద్దీ దీన్ని చేయడమూ కష్టంగా మారుతుంది. గర్భాశయ ద్వారం తెరుచుకోవడానికి మందులు వాడి తర్వాత ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. ఇది కూడా కొన్నిసార్లు సమస్యలు తెచ్చి పెడుతుంది. అబార్షన్‌ని సురక్షిత పద్ధతుల్లో చేయించుకున్నా సరే, రెండు లక్షల మందిలో ఒకరికి దాని వల్ల సమస్యలు తప్పడం లేదు.
సర్జరీ ద్వారా అబార్షన్ చేసేటప్పుడు అరుదుగా గర్భాశయం చిల్లులు పడి, విపరీతమైన రక్తస్రావం కావచ్చు. అలా జరిగినప్పుడు నెగెటివ్ ప్రెషర్ వల్ల గర్భసంచికి, పేగులకి, మూత్రాశయానికి కూడా చిల్లులు పడే అవకాశం ఉంది. దీనిని నిర్ధరించడానికి లాప్రోస్కోపీ చేయాల్సి ఉంటుంది. చిల్లులు పడిన భాగానికి తిరిగి కుట్లు వేయాలి. కొన్నిసార్లు దీనికోసం ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. నలభై సంవత్సరాల క్రితం సెప్టిక్ అబార్షన్లు ఎక్కువగా అయ్యేవి. అంటే సరైన సదుపాయాలు లేని చోట, ఎవరితో పడితే వాళ్లతో గర్భస్రావం చేయించుకోవడం అన్నమాట. దాంతో సెప్టిక్ షాక్ సిండ్రోమ్ సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యేవాళ్లు. ఇప్పుడు మరీ అంతటి సమస్యలు లేవు కానీ.. సొంతంగా మాత్రలు వేసుకోవడం, రకరకాల ప్రయోగాలు చేయడం వల్ల అధిక రక్తస్రావం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు మాత్రం తప్పడం లేదు. వాటి బారిన పడకుండా ఉండాలంటే వైద్యుల సూచన మేరకు గర్భ నిరోధక సాధనాలను వాడుతూ అవాంఛిత గర్భం రాకుండా జాగ్రత్త పడాలి. 'ఏమవుతుందిలే.. అంతగా అయితే అబార్షన్ చేయించుకోవచ్చులే..' అనుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదు..!

Post A Comment:
0 comments: