" The less men think more they talk"

ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోండి : ''మీలో ఎవరు ఎక్కువగా మాట్లాడతారు?'' ఈ ప్రశ్న వేసుకోండి. మీరా? మీభార్యా? మీ పిల్లలలో ఎవరన్నానా? మీ మిత్రులలో ఎవరన్నానా? మీ ఆఫీసులో ఎవరన్నానా?
ఒకసారి వెనక్కు తిరిగి మీరు గడిపిన రోజును గుర్తుకు తెచ్చుకోండి. ఉదయం ఆఫీసుకు లేదా షాపుకు వెళ్ళకముందు మీ ఇంట్లో ఆఫీసుకు వెళ్లాక అక్కడ, భోజన సమయంలో, మళ్ళీ ఆఫీసులో, మిత్రులతోపాటు హోటల్లో, క్లబ్‌లో.... ఎవరు ఎక్కువగా మాట్లాడారు?
వీటన్నింటిలోను మీరు ఎక్కువగా మాట్లాడినట్లు జవాబు వస్తే మాట్లాడటంలేదు. వాగుతున్నారు అని అర్దం చేసుకోండి.ఇక మీరు క్రమంగా మిత్రులను కోల్పోతారు. మీ ఇంటి సభ్యులే మిమ్మల్ని అసహ్యించుకోవడం మొదలెడతారు.
పాపం ఒకసారి వినేవారి ముఖాలు కూడా చూడండి : మీరు మాట్లాడేప్పుడు ఎవరన్నా వినకపోవడం మీ దృష్టికి వస్తే వెంటనే మాట్లాడటం ఆపండి. మెల్లిగా అతడు మీవైపు చూస్తాడు. అప్పటికే మీరు ఆ విషయం పైన ఎక్కవగా మాట్లాడారేమో..... ఆ విషయం తెలుసుకోవడానికి
''ఇంకా వింటారా?'' అనిఅడగండి. మొహమాటానికి ఆవ్యక్తి చెప్పమనవచ్చు కూడా. కానీ ముఖంలో ఉత్సాహం లేక కంఠం నీరసంగా పలికితే మీరు ఇప్పటికే చాలా వాగారని గ్రహించండి.

ఎదురు మాట్లాడరు :   
నేను మాట్లాడేప్పుడు ఎవరూ ఎదురు మాట్లాడరు. అంతా నిశ్శబ్ధంగా వింటారు కనుక నేను మంచి వక్తను అనుకుంటే అదిపొరపాటే. అసలు మీరు మీ మాటలతో ఎదుటి వారికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదేమో ఆలోచించండి! మీ మాటలు ఎంత మూర్ఖంగా ఉన్నాయంటే, మీతో వాదించడం కూడా వ్యర్ధమేనని వారు మౌనంగా ఉన్నారేమో కూడా చూడండి.

ఊతపదాలు :
ఒకసారి నేను ఒక పెద్దమనిషి ''గురుదక్షిణ యొక్క గొప్పతనం'' అనే విషయంపైన మాట్లాడటం విన్నాను. ఆయన 45 నిముషాల ఉపన్యాసంలో 142సార్లు ''ఆయొక్క-ఈ యొక్క'' అనే పదాలు వాడాడు. అంతేకాదు వ్యాసుడు వేదాలను తెనిగించాడని అన్నాడు. మరోచోట ఇంకొక పెద్దమనిషి రామాయణం వ్యాసుడు వ్రాశాడన్నాడు. ఆ మొదటి వ్యక్తికి తరువాత వివరంగా అతడి లోపాల
గురించి చెప్పినప్పుడు ''ఊత పదాల వాడకం గురించి నాకు చాలామంది చెప్పారండి కానీ ఎందుకో నన్నవి విడవడం లేదు'' అన్నాడు. అప్పుడు నేను ''చాలామంది ఆ మాట చెప్పగా మీరు విన్నారే గాని, నమ్మలేదు; నమ్మి ఉంటే ఎప్పుడో మార్చుకునే వారు'' అన్నాను. అప్పుడాయన ''మరి ఇందులో నుండి బైటపడే మార్గమేమిటి?'' అన్నాడు నేను ఆయన ఉపన్యాసాలను టేపు చేసుకొని స్వయంగా తన లోపాలను వినడం ద్వారా వాటినుండి బైటపడవచ్చని చెప్పాను.  అయితే ఇక రెండవ విషయం తప్పులు మాట్లాడటం, మనందరికీ తప్పులు పోతాయి అనడంలో సందేహం ఏమాత్రం లేదు. కాకపోతే వాటిని తగ్గించడానికి
మనం బాగా హోమ్‌వర్క్‌ చేసుకోవాలి. అంటే ఇంటి దగ్గర విషయాన్ని చక్కగా అధ్యయనం చేసుకురావాలి.

కోన్‌ (KOAN) ::
మొత్తం ప్రపంచ మత, తత్వ సంప్రదాయాలన్నింటిలోను కూడా జెన్‌ (ZEN) చాలా విచిత్రమైన తత్వశాస్త్రం. అన్ని మతాలకు మత గ్రంథాలున్నాయి గాని దీనికి లేదు. జెన్‌ ఉపదేశాలను కోన్‌లు (Koans) అంటారు. తర్కబద్ధం కాని ఒక పిచ్చికథ లేదా విచిత్ర పదవిన్యాసం, లేదా మాటలకందని కొన్ని గమ్మత్తయిన సైగలను కోన్‌ అంటారు. ఈ కోన్‌ల ద్వారా ఆ తత్వవేత్తలు తమ శిష్యులను బుద్ధినుండి దాని తర్కపరిధి నుండి లేపి అనంత మనోరహిత శూన్యంలోకి నెట్టివేస్తారు.

ఉదాహరణకు .....

బాగా ప్రఖ్యాతిగాంచిన జెన్‌మాస్టర్‌ ఒకరు భుజాన గుడ్డల మూట ఒకటి పెట్టుకొని ఒక చిన్న నగరంలోకి ప్రవేశించాడు. ఇద్దరు విద్యార్ధులు ఆయనను గుర్తించి, దగ్గరికి వెళ్ళారు. అందులో ఒకడు జెన్‌ యొక్క అర్ధం ఏమిటి. (What is the significance of Zen?)  అని అడిగాడు. వెంటనే ఆ మాస్టర్‌ భుజాన ఉన్న గుడ్డల మూట తీసి నేలకు విసిరికొట్టాడు. తరువాత రెండవవాడు ''మరి
జెన్‌ను సాక్షాత్కరించుకోవడం ఎలా? (What is the actualization?)  అన్నాడు. వెంటనే ఆ మహాత్ముడు గుడ్డలమూటను భుజాన వేసుకొని తన దారిన తాను వెళ్ళాడు.
మనసు అనే బరువును తీసి పారవేసి అమనస్కులు (మనస్సు లేనివారు) గా మారడమే జెన్‌ అంటే. ఈ స్థితికి చేరుకున్నవారు జనజీవన స్రవంతిలో కలిసిపోయి, అహంకార రహితులై సాధారణ మానవులుగా యధావిధిగా పనులు చేసుకొని పోవడమే 'జెన్‌'ను సాక్షాత్కరింపచేసుకోవడం. ఈ రెండు విషయాలను ఆ మాస్టర్‌ బట్టలమూటను పారవేసి, మళ్ళీ ఎత్తుకోవడమనే కోన్‌ (Koan) ద్వారా సూచించాడు.
వాగడం మాని మాట్లాడటమంటే ఇది. విషయాన్ని చెప్పడానికి పదిమాటలు అవసరం లేదు ఒక్కటి చాలు.

T.V లో వాగుడు
మీరు టి.విలో సంభాషణలు (Interviews) చూసే ఉంటారు. పది మాటలలో అడగగల ప్రశ్నను 50 మాటలలో సాగదీస్తారు ప్రశ్నించేవారు. కెమేరా అంతసేపు తమవైపుతిరిగి ఉండాలి. తాను ఎక్కువ సమయం వరకు టి.విలో కనిపించాలి అనే కోరిక తప్ప మరొకటేదీ కనిపించదు వారి ప్రశ్నలో.
మరి ఈ వాడుగు తగ్గించుకోవడం ఎలా? ''నేను ఎక్కువగా వాగుతున్నానా (మాట్లాడుతున్నానా)'' అని ఇతరులను అడగండి. వారు అవునంటే (అవుననకపోయినా అలాంటి సూచన అందితే) ఈ క్రింది ఉపాయాలతో వాగుడు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

ముద్దంటే నాకిష్టం :
ఒక మంత్రిగారు ఉపన్యాసాలకు ఎక్కడికి వెళ్ళినా ఆయన భార్య వెంట ఉండేది. ఆయన ఉపన్యాసం కొంత కొనసాగిన తరువాత ఆవిడ ఒక కాగితం మీద ''ముద్దు'' (Kiss) అని వ్రాసి స్టేజిమీదికి పంపేది. వెంటనే ఆయన తన ఉపన్యాసాన్ని 5-6 నిమిషాలలో ముగించేవారు. చాలా రోజులు ఈ వ్యవహారం నడిచిన తరువాత మంత్రిగారి సెకరెటరీ 'ముద్దు' కు అర్ధమేమిటని అడిగితే
ముఖ్యమైన విషయాలు తప్ప మరీమే వద్దు (keep it simple stupid) అని
 ''ము....ద్దు'' అక్షరాల మధ్య 13 అక్షరాలు ఉన్నాయని చెప్పారట. కనుక మీకు తెలియకుండానే మీకు ఉద్రేకం ఎక్కువయ్యి వాగుతూ ఉంటే, ఎవరినైనా గడియారం ఊపడం ద్వారాగానీ, లేక ఒక వేలు పైకి లేపి చూపించడం ద్వారాగానీ, వాగుడు తగ్గించమని హెచ్చరించేలా చెప్పిపెట్టండి. వెంటనే మీ నాలికకు పగ్గాలువేసి జోరునాపండి.

రెండింతల నష్టపరిహారం :   
మీరు ఎంతసేపు మాట్లాడితే అంతకు రెండింతల సమయం (Double) ఎదుటివారిని మాట్లాడనివ్వాలి. ఇకమీరు ఇన్నాళ్ళూ ప్రజలను మీ వాగుడుతో ఎంత బాధించారో తెలుస్తుంది. క్రమంగా మీరే మాట్లాడటం తగ్గించగలరు.

 ఆగితే పాపం :
మీ వాగుడు మధ్యన మీరు ఊపిరి పీల్చుకోవడానికి ఒక్క క్షణం ఆగితే చాలు, వెంటనే ఎదుటివారిని మొదలు పెట్టమని ముందేచెప్పి ఉంచండి. దానితో ఎదుటివారు కూడా మాట్లాడవలసింది ఉన్నది అనే విషయం మీకు గుర్తుకు వస్తుంది. మీ వాగుడుకు పగ్గాలుపడతాయి.

సెన్సార్‌ :
ప్రశ్నలను, జవాబులను కూడా సాధ్యమైనంతగా కుదించడం అలవాటు చేసుకోండి. ప్రారంభంలో అది అంత సులభమైన విషయం కాకున్నా మీకది క్రమంగా అలవడగలదు.

ఒకే విషయం :
అనేక విషయాలు కొద్ది మాటలలో ఇరికించిగానీ, లేక ఒకే విషయాన్ని అనేక మాటలతో సాగదీసి గానీ ప్రజలను బాధించకుండా, స్పష్టంగా ఒకే విషయాన్ని కొద్ది మాటలలో చెప్పి సమాజంలోని ఇతరులతో మీ సంబంధాన్ని, స్నేహాన్ని ధృఢం చేసుకొని, ఆనందంగా జీవించండి.


బతికిపోయాం :
ఒక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ టెలికాస్ట్‌ అవుతున్నప్పుడు ఆడియో (శబ్ధం) ఆగిపోయి కొన్ని నిముషాల వరకు కేవలం దృశ్యం మాత్రమే మిగిలింది. మళ్ళీ శబ్ధం రావడం మొదలుకాగానే అనౌన్సర్‌ (వ్యాఖ్యానించేవాడు) మీకు కొన్ని నిము షాల వరకు విశ్రాంతి లభించిందనుకుంటాను అన్నాడు. ఎన్నో వేలమంది ''నిజమే. అనౌన్సర్‌ గోల లేకుండా ప్రశాంతంగా ఆట చూడగలిగినందుకు ఆనందిస్తున్నాం' అంటూ టి.వి. స్టేషన్‌కు ఉత్తరాలు వ్రాశారు. కాబట్టి ఏవాక్కునైతే ప్రేమలో ముంచి ఉపయోగించడం వల్ల అందరినీ ఆలింగనం చేసుకోగలమో, అదే వాక్కును విపరీతంగా ఉపయోగించి అందరినీ దూరం చేసుకోబోకండి.   
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: