రూ‍పాల సంగమేశ్వరం, కర్నూలు


క్రీస్తు శకం ఆరు నుండి తొమ్మిదవశతాబ్దం మధ్య కాలంలో బాదామి చాళుక్యులు తుంగభద్రా నది ఒడ్డున అలంపురం ఆలయ సముదాయాన్ని నిర్మించారు. ప్రస్తుతం బాదామి కర్ణాటక లోని చాగల్ కోట జిల్లాలో ఉన్నది. నిర్మాణాల కవసరమైన రాళ్ళను ఎడ్ల బండ్లపై తరలించే వారు. ఆ బళ్లు నదిలో ప్రయాణిస్తున్నందున వాటికి వేసిన కందెన నీటిలో కరిగి పోయేది. మళ్లీ కొత్తగా వేయాల్సి వచ్చేది. ఆ చక్రాలకు వేసే కందెన తయారీకి ఒక గ్రామం వెలసింది. అదే కందెన వోలు. కాలానుగుణంగా దాని పేరు కర్నూలు గా మారింది.

చారిత్రిక ప్రాశస్త్యం


దక్షిణా పథం లో శాతవాహనుల తర్వాత వర్థిల్లిన మొదటిరాజ్యం బాదామి చాళుక్యులది. ఈ వంశం నుండే అనేక చాళుక్య రాజ్యాలు ఏర్పడినాయి. కర్ణాటకలో కళ్యాణి, ఆంధ్రప్రదేశ్ లో వేంగి, వేములవాడ, ఎలమంచిలి, ముదిగొండ మొదలగునవి. బాదామి చాళుక్యుల కాలం నాటికి బౌద్ధ మరియు జైన మతాలు విస్తారంగా వ్యాప్తిలో ఉన్నాయి. వీరు మాత్రం వైదిక మతాన్ని అవలంబించారు. వీరి తొలి రాజధాని ఐహోలోను. తరువాతి కాలం నాటి రాజదాని బాదామి లో ఎన్నో ఆలయాలు, గుహాలయాలను నిర్మించారు. వీటిలో కొన్ని బౌద్ద , జైన ధర్మాలకు సంబంధించినవి ఉన్నాయి. వీరు కృష్ణానది ఉపనది మలప్రభానది ఉత్తర వాహినిగా ఉన్న పట్టాడకల్ లో పట్టాభిషేకాలు జరుపుకునే వారు, అక్కడ పాపనాథ, గులగనాథ, సంగమేశ్వర మొదలైన ఆలయాలను నిర్మించారు. వీరికి పల్లవులతో నిరంతర యుద్దాలు జరిగేవి. విజయానికి గుర్తుగా వారి రాజధాని కంచి లోని కైలాసనాథ అలయాన్ని పోలిన ఆలయాన్ని చాళుక్య రాజులు పట్టాడకల్ లో నిర్మించారు. వీరి రాజ్యంలో మలప్రభ - కృష్ణతో సంగమించే 'కూడలి' లో సంగమేశ్వరాలయం నిర్మించారు. ఇక్కడే కొన్ని శతాబ్దాల తర్వాత తొలి కన్నడ కవి, సంస్కర్త, వీర శైవ మత స్థాపకుడు, బసవన్న సమాధి అయ్యాడు. రాజ్య విస్తరణలో భాగంగా చాళుక్యులు మొలక సీమ లేక ఏరువసీమ లేక రెండేరుల నడిమి సీమగా పిలవబడే రస్తుత మాహబూబ్ నగర్ - కర్నూలు జిల్లాలలోని భూభాగాన్ని తమ ఏలుబడి కిందకు తెచ్చుకున్నారు. ఈ సీమలో తుంగభద్రానది కృష్ణతో కలిసే కూడలి లేక కూడవల్లిలో తాము పట్టాడకల్ లో నిర్మించిన ఆలయాలను నమూనాగా తీసుకుని, శిలాలకు మరింత కొత్త సొబగులను రంగరించి నిర్మించారు. పదడుగుల ఎత్తైన వేదిక పై చుట్టూ ఏనుగు తలలతో ఢిల్లీ లోని అక్షరధామ్ ఆలయానికి ఇది ప్రేరణా అన్నట్లు నిర్మించారు. వేదికపైన ఆలయ ద్వారం ప్రక్కగా శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు, గంగ, యమున, అర్థనారీశ్వర , హరిహర, గజలక్ష్మి, అష్ట దిక్పాలకుల విగ్రహాలే కాక, ఎన్నో లతలను, హంసలను చెక్కారు. మొసలి పట్టుకున్న ఓ మనిషి ముఖంలో మూడు వైపుల నుంచి చూస్తే మూడు వివిధ దశలైన బాల్య, యౌవన, వృద్ధాప్య దశలు కనిపించేలా చెక్కిన శిలం అశ్చ్యరాన్ని గొల్పుతుంది.

కూడలి సంగమేశ్వరాలయ నిర్మాణానంతరం చాళుక్యులు ఇక్కడ మరిన్ని ఆలయాలను నిర్మించాలనుకున్నారు. కాని వరద సమయాల్లో ఆలయంలోనికి ఒండ్రు మట్టి చేరుతున్నందున మరో ప్రాంతంలో ఆలయాలు నిర్మించాలని అన్వేషించగా, అలంపురం అనువుగా కనిపించింది. తుంగభద్రానది ఉత్తర వాహిని కావడం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ క్షేత్రం ఉండటం వల్ల, జమదగ్ని ఆశ్రమం ఉండటం వల్ల ఇక్కడ నవ గ్రహాల ఆలయాల సముదాయాన్ని నిర్మించారు. అవి పట్టాడకల్ లోని గలగనాథ, పాపనాథ, ఆలయాలను పోలి ఉంటాయి. కాలక్రమాన చాళుక్యుల ప్రాభవం తగ్గసాగింది. రాష్ట్రకూటుల ప్రాభవం పెరిగింది. వీరు పల్లవులతో సంబంధ, బాంధవ్యాలు నెరపి చాళుక్యులను జయించారు. ఆ విజయానికి గుర్తుగా ఎల్లోరా లో కొండను తొలిచి కైలాసనాథ ఆలయాన్ని నిర్మించారు. ఇక మొలక సీమ వైపు చూస్తే 'నివృత్తి సంగమం' కనిపిస్తుంది. అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు భవనాశిని' నదిగా రూపాంతరం చెంది కృష్ణలో కలిసే స్థలమది. ఈ నది కృష్ణలో కలిసే ఏడవ నది అయినందున దీనిని సప్తమ నదీ సంగమమని సప్తనదీ సంగమేశ్వరమనీ వ్వవహరిస్తారు. ప్రజల పాపా ప్రక్షాళన చేసిన గంగాదేవికి జనుల పాప ప్రక్షాళన చేసిన గంగా దేవికి కాకి రూపం రాగా, ఈ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని, ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనికి నివృత్తి సంగమేశ్వరం అని పేరొచ్చిందని ఒక కథనం. ఆరణ్య వాస సమయంలో ఇక్కడ ధర్మరాజు లింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించి, లింగాల కోసం భీముడిని కాశికి పంపగా, సమయానికి తిరిగి రానందున వేప మొద్దును శివలింగంగా ప్రతిష్ఠించాడని ఒక కథ ప్రచారంలో ఉన్నది. కోస్తా తీర ప్రాంతంలో పంచారామాలుండగా ఇక్కడ మల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం పేర్ల తో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని , ఇవన్నీ భీముడు తెచ్చిన లింగాలపై వెలిశాయని మరొక కథనం.

నివృత్తి సంగమేశ్వరంలో రాష్ట్ర కూటులు నిర్మించిన ఆలయాలకు రూపాల సంగమేశ్వరమని పేరు. వారు తమ నిర్మాణాల్లో చాళుక్యుల మౌలికాంశాలను, తమ బాంధవ్యాల వల్ల పల్లవుల అలంకారాన్ని జోడించారు. సంగమేశ్వరాలయం, దాని ప్రక్కన భుజంగేశ్వరాలయాలు మహబలిపురంలో రాతి రధాలను పోలి ఉండేవి. ఆలయం వెలుపల నటరాజ మూర్తులు, పైకప్పులో ఆనంద తాండవం చేస్తున్న శివుని శిల్పాలు ఉన్నాయి. అంతేకాక ఒకే రాతిపై గంగ, యమున, పార్వతుల మూర్తులను మలిచారు. తర్వాతి కాలంలోని కళ్యాణి చాళుక్యులు అలంపురం సమీపంలో పాపనాశని ఆలయాల పేరుతో ఆలయ సముదాయాన్ని నిర్మించారు.



శ్రీశైల జలాశయం నిర్మించాక ఈ సంగమేశ్వర, అలంపుర ఆలయాలన్నీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడే పరిస్థితి రాగా..... పురావస్తు శాఖవారు సంగమేశ్వరాలయాలను విడదీసి వేర్వేరు ప్రాంతాలలో పునర్నిర్మించారు. కూడలి సంగమేశ్వరాలయాన్ని , పాపనాశన ఆలయాలను అలంపురం వెళ్లే దారిలోనే పున: ప్రతిష్ఠించారు. అలంపురం నవ గ్రహాలయాలకు అడ్డుగా ఓ పెద్ద గోడను నిర్మించారు. రూపాల సంగమేశ్వరాలయాన్ని కర్నూలు సమీపంలోని జగన్నాధ గట్టు పై కట్టారు. కాని ఈ జోడు రథాల్లాంటి ఆలయాల్లో మరొకటైన భుజంగేశ్వరాలయాన్ని నంది కొట్కూరు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద నిర్మించారు. త్రివేణి సంగమ శిల్పం మాతం హైదరాబాదు లోని పురావస్తు శాఖ వారి ప్రదర్శన శాలలో ఉన్నది. ఇది పబ్లిక్ గార్డెన్ లో ఉన్నది. నివృత్తి సంగమేశ్వరాలయం అలాగే నీటిలోనే మునిగి ఉన్నది. ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం జలాశయం లోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయట పడుతుంది. అలా బయట పడే నాలుగు నెలలు అనగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు. ఈ ఆలయాలన్నీ చూడాలంటే కర్నూలు కేంద్రం చేసుకొని చూడొచ్చు. అదే అనుకూలం. 
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: