" He's my friend, the man said "he listens to me"

ఓపికగా మీ మాట వినేవాడిలో ఎన్ని లోపాలున్నా అతడు మీకు మిత్రుడిలా కనిపిస్తాడు. కాని విననివాడు ఎంత మంచి వాడైనా దుర్మార్గుడిలా కనిపిస్తాడు. ఎలా వింటున్నారు ?
మీరు వినేటప్పుడు....
''విసుగుదలతో వింటున్నారా?''
''ఏమాత్రం విషయంలో శ్రద్ధ చూపడంలేదా?''
''మధ్యమధ్య ఏదో రకంగా విఘాతం కలిగిస్తున్నారా?''
ఈ విధంగా వినడం,నేర్చుకోవడానికి మీకుగానీ, మాట్లాడే వ్యక్తిలో ఉత్సాహం నింపడానికిగాని ఉపయోగపడదు.
సరిగ్గా వినడంవల్ల మీరేం పొందగలరు?
మానవ సంబంధాలలో అతిబలమైన వంతెన వినడం.

1. వక్త మిమ్మల్ని ఇష్టపడతాడు :
 వినేవాడి ముఖంలోని శ్రద్ధ ''ఓ వక్తా! నువ్వు చాలా ముఖ్యమైనవాడివి'' అనే భావాన్ని చూపిస్తుంది. ఈ ప్రపంచంలో అతడి మాటను అతడి భార్యగాని, పిల్లలుగానీ, మిత్రులుగానీ, ఆఫీసులో కలిసి పనిచేసేవారుగాని ఎవరూ వినరు. మీరు వింటున్నారు కనుక మిమ్మల్ని విశ్వశించవచ్చునని, మీ మీద ఆధారపడవచ్చునని అతడనుకుంటాడు.

2. మీరు నేర్చుకోవచ్చు :
"Who learns by finding out has seven fold the skill of him who learns by being told."

తనంతతాను తెలుసుకున్న విషయంలో వచ్చే సామర్ధ్యం, వినడం వల్ల వచ్చినదానికి ఏడింత లెక్కువుంటుంది''. అనే మాట నిజమైనప్పటికీ జీవితాలు గడిచిపోతాయిగాని ఏడు వందల మందిలో ఒక్కడుగూడా విషయాన్ని తనంతటతాను నేర్చుకోలేడు. మనకు తెలిసిన దానిలో నూటికి 99 శాతం వినడం చూడటంవల్లే నేర్చుకున్నామనడంలో సందేహం లేదు.

3. వక్త గురించి తెలుసుకోవచ్చు :
తనకు అందిస్తున్న ఆ విషయాన్ని నేర్చుకోవడానికి ఆయన జీవితంలోఎన్ని కష్టాలుపడ్డారో, ఎవరెవరిని సేవించాడో, ఎన్ని గ్రంథాలు అధ్యయనం చేశాడో తెలుస్తుంది. దానితో మీకు ఆయనపై గౌరవం పెరుగుతుంది. అతడి అలవాట్లు, సామర్ధ్యం, శీలం మొదలైనవి మెచ్చుకోవడం మొదలెడతారు.


4. మీకు సృజనశీలత కలుగుతుంది :
మనం వినేప్పుడు కేవలం వినడం మాత్రమే జరగదు మన మనస్సు కూడా ఆలోచిస్తూ ఉంటుంది. వక్త యొక్క ఆలోచనలు, మన ఆలోచనా మార్గంలో కొత్త ద్వారాలను తెరవవచ్చు. ఒక్కొక్కసారి అతడు చెబుతున్న దానికి మనకు వచ్చిన ఆలోచనకు ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు కూడా. అయినా అతడి వాక్కే మీ ఈకొత్త ఆలోచనకు నాంది పలికింది అనడంలో సందేహం ఏమాత్రం లేదు.


5. ఎవరినుండి వినాలి?
మనకెప్పుడూ పైవాళ్ళు అంటే తల్లిదండ్రులు, ఆఫీసర్లు, అన్నలు మొదలైనవాళ్ళు చెబితే వినడం అలవాటు. కానీ క్రింది వాళ్ళు పిల్లలు, మీ క్రింద పనిచేసేవారు, తమ్ములు మొదలైన వారినుండి కూడా వినడం మొదలెట్టండి.


ఎలా వినాలి ?
1. కిటికీలో నుండి ఇంకెటో చూస్తూ కూడా మనం అతడు చెప్పింది వినవచ్చు. కానీ ఆయననే చూస్తూ వినడంవల్ల మనం శ్రద్ధ చూపుతున్నామని గ్రహించి, చెప్పడంలో ఆయన మరింత ఉత్సాహం చూపగలడు.
2. మధ్యమధ్య ''ఇదేనా మీరు చెప్పింది?'' ''ఇదేననుకుంటా మీ ఉద్దేశం'' ''అరే! ఈ విషయాలన్నీ మీరు ఎలా నేర్చుకున్నారు?' అంటూ ప్రశ్నించండి. అప్పు డాయన మరింత ధైర్యంగా ఉత్సాహంగా కేవలం విషయాన్నే గాక దాన్ని సేకరించిన తన వ్యక్తిగత జీవిత విధానాన్ని కూడా మీ ముందుంచ గలడు. అతడు చెప్పింది మీకు అర్ధం కాలేదనుకుంటే ''అదికాదు నేను చెప్పింది'' అంటూ మళ్ళీ ప్రారంభించగలడు.
3. అంతేకాదు మళ్ళీ మళ్ళీ ''ఇది నిజంగా చాలా చక్కటి విషయం!'' 'అరే! ఇంత వరకు ఈ విషయం నేను ఎక్కడా వినలేదు!' ''ప్రస్తుతం సమాజానికి కావలసింది ఇదే!'' ''ఈ విషయం అందరికీ చెప్పగలిగితే ఎంత మార్పు వస్తుందో తెలుసా!'' అనడం వల్ల మీరు ఇంకా వినడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం వక్తకు అర్ధమౌతుంది. అంతేకాదు వక్త పూర్తిగా చెప్పడం
అయిన తరువాత కూడా ''ఇంతేనా! ఇంకా ఏమైనా చెబుతారా''అనండి.  ఆయన గనుక మంచి వక్త అయితే అదే విషయాన్ని మరొక కోణం నుండి ప్రారంభిస్తాడు.

4. అతడు చెప్పిన విషయం మీకు కొత్తది కాకున్నా, పెద్ద విలువైనది కాకున్నా, విషయం తప్పయినా అతడికి ధన్యవాదాలు తెలియజేయండి. దానితో ఈసారి ఆయన తప్పక మీకు తెలియని విషయం, పనికివచ్చే విషయం, విలువైన విషయం చెప్పగలడు. ఏం చేయగూడదు?
అతడు చెప్పిన వ్యక్తి పేరో, వస్తువుపేరో, వీదిపేరో తప్పయినా సరే ''అతడు గాంధి కాడు-నెపోలియన్‌' అని అనబోకండి. తాను తప్పు చెప్పానని తెలియగానే ఆయన అవమానంగా భావించవచ్చు. తరువాత చెప్పవలసింది మరిచిపోవచ్చు లేదా చెప్పేది చెప్పడంఆపకుండా మీతో వాదించడానికి సిద్ధపడవచ్చు.
''నాకు తెలుసు'' అనబోకండి. అతడు చెప్పేది పూర్తిగా వినకముందే ఆయన ఫలానాది చెప్పబోతున్నాడని, అది మీరెరుగుదురని మీకెలా తెలిసింది? కనుక సరిగ్గా వినడం నేర్చుకోండి.
షేక్స్ప్‌యర్‌ అన్నట్టు "The disease of not listening" ''వినని రోగం'' (వినకపోవడమే రోగం) గురించి చెప్పడానికి చాలా ఉంది. ఆంగ్లంలో వీటిమీద చాలా పుస్తకాలు ్బడా ఉన్నాయి. మీరు చదివి ఇంకా నేర్చుకోవచ్చు. ఒకటిమాత్రం గుర్తుంచుకోండి. వినడం అనే కళవల్ల మానవ సంబంధ
బాంధవ్యాలు బాగుపడినంతగా మరిదేనివల్ల అంత ఉపయోగం ఉండదు. కనుక సరిగ్గా వినండి - కలిసి జీవించండి!

చెప్పేవాడు చాదస్తుడైనా కనీసం వినేవాడు వివరం గలవాడై ఉండాలి.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: