అడ్లర్ వైయక్తిక మనోవిజ్ఞానం (Individual Psycology) అధికార వాంఛా ప్రధానమైనది. ఆయన మనుషులంతా హీనతా గ్రంధి (Inferiority Complex) కి లోనై ఉన్నారంటాడు. వ్యక్తి జీవితంలో ఎక్కడ, ఏవిధంగా, ఏస్థితిలో ఉన్నప్పటికీ నాకన్నా తక్కినవారు ఉన్నతంగా ఉన్నారని, ముందున్నారని, ఎక్కువగా కలిగి (ధనం, అందం, పేరు ప్రతిష్టలు మొ||) ఉన్నారనే మానసిక వ్యధ వారిని విడువకుండా ఉండటమే హీనతా లేదా న్యూనతా గ్రంధి అంటే.
ఉక్రోషం :
మనిషి తనలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవడం, లేదా కప్పిపుచ్చుకోవడం కొరకు మహత్వ కాంక్షతో మునిగిపోతారని సిద్ధాంతీ కరించాడు అడ్లర్. చిన్నతనంలో ఏ పిల్లలయితే త్వరగా నడక నేర్చుకోరో వారే పరుగుపందాలలో గెలుపొందే గొప్ప ఆటగాళ్ళుగా వన్నెకెక్కుతారని, ఒంటి కన్నువారు మామూలుగా రెండు కండ్లు ఉన్నవారికన్నా తెలివిగలవారవుతారని అనేవాడాయన. అది రెండు కండ్లతో చేయగల పనిని ఒకే కన్నుతో సాధిద్దామని ప్రయత్నించడం వల్ల వచ్చిన కపటమని, అలాగే మేము ఇతరులలాగ నడవలేమన్నారు కదా చూడండి మేము అందరికన్నా వేగంగా పరిగెత్తగలం అని చెప్పిన ఉక్రోషమని అనేవాడాయన.
హీనత అనివార్యమా :
అయితే తమలోని లోపాల వల్ల హీనతాగ్రంథి, దీనివల్ల అధికారవాంఛ ప్రతివారికి అనివార్యమని, దీనివల్ల ప్రపంచంలోని అడుగడుగునా ప్రజల మధ్య పోటీ తప్పదని, స్పర్ధ తప్పదని దీనివల్లే ప్రజలలో కలహం సహజమని దీనిలో నుండి బైటపడటానికి అధికార వాంఛను కాస్త తగ్గించు కోవాలని ఆయన అంటారు. కానీ ఆ తగ్గించుకోవడం ఎక్కడివరకు? అనేది ప్రశ్న వాంఛఅనేది ఉన్నప్పుడు అది ఏస్థాయిలోనన్నా తృప్తిపడుతుందా? బౌద్ధికంగా ఈ విషయం అందరి అవగా హనకు వస్తే, అధికార వాంఛ అనే ఈ పరుగుపందెం ఆగిపోతుందన్నాడు అడ్లర్.
కానీ ఇంత విశ్లేషణ నిచ్చిన ఆయనే స్వయంగా ఈ పోటీనుండి తప్పుకోలేక పోయాడు. తాను గురువునవ్వాలి, మార్గదర్శకుణ్ణవ్వాలి అనే వాంఛతో తన గురువైన డా|| ఫ్రాయిడ్ నుండి తప్పుకొని, తన కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ పోటీలో నుండి బైటపడి అంతా కలిసి జీవించే విధానం ఒకటి ఉన్నదంటాడు ''లాఓత్సే'' అధికార వాంఛ అనేది రోగం; అది
ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఉన్నట్లే గాని రోగరహితులుగా ఎవరూ లేరు. ఈ రోగం పోనంతవరకు అంతా స్పర్ధారహితంగా జీవించడం సాధ్యంకాదు. మరి ఇది ఎలా పోతుంది? మార్గమేమిటి?
''మహానదులు, సముద్రాలు కనుమలకు ఏవిధంగా స్వామిత్వం వహించగలిగాయి? తమను నీచస్థానంలో నిలుపుకోవడం వల్ల, క్రిందికి ఒరగడం వల్లే అవి కనుమలకు స్వామిత్వం వహించగలిగాయి. కనుక ప్రజలకు స్వామిగా మారదలచిన వాడు, వారిని అనుసరించేవాడిలాగా మాట్లాడాలి. వారి వెనుక నడవాలి. ఇలా ఉండటం వల్లే సాధువు అందరికన్నా ఉన్నత స్థానంలో ఉంటాడు; ప్రజలకు ఆయన బరువుకాడు. ఆయన అందరికన్నా ముందు నడుస్తాడు. ప్రజలు ఆయనకు హాని తలపెట్టరు''. అంటాడు లాఓత్సే ''తన తావో తెహకింగ్'' అనే గ్రంధంలో.
ముందా ! వెనుక? :
అహంకారం, ఘర్షణకు, ఘర్షణ పోటీకి దారితీస్తుంది. ఈ పోటీ కారణంగానే ప్రజలు కలిసి బ్రతకలేరు. అందరికన్నా ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నించేవాడు ఏ నాటికైనా ఓడిపోతాడు. తాటిని తన్నే వాడుంటే వాడి తలదన్నే వాడుండటం కూడా సహజమే కదా! కనుక జీవితంలో ఈపిచ్చి పరుగు వ్యర్ధమని గ్రహించి వెనుక నిలబడేవాడు ఎప్పుడూ విజయుడిగానే ఉంటాడు.
ముందుకు వెళదామని ప్రయత్నించేవాడే నిమ్నుడుగా మిగిలిపోతాడు. పోటీలో పాల్గొనని వాడితో పోల్చడానికి ఎవరున్నారు? పోల్చబడనివాడు ఎప్పుడూ శ్రేష్ఠుడే; నువ్వు ఎలాగుంటే అలాగే శ్రేష్ఠుడివై పోతావు. నదులు నిమ్న స్థానానికి వెళ్ళడానికి, క్రిందికి ఒరగడానికి సిద్ధపడతాయి. కనుకే అవి గొప్పవైనాయి.
పిల్లలే నయం :
ఈ ఒరిగిపోగల కళలు పిల్లలు బాగా ఎరుగుదురు. వారి శరీరంలోని కండరాలు, ఎముకలు అన్నీ చాలా మెత్తగా ఉంటాయి. వృద్ధులు శరీరాలు పెళుసుబారిపోతాయి. నిజానికి అదే మృత్యువు యొక్క లక్షణం నది సముద్రం వైపుకు ఒరుగుతుంది. అందువల్లే అది నిరంతరం ప్రవహిస్తుంది. అలాగే వ్యక్తి ్బడా అహంకార రహితుడై వినయంగా ఒరగగలిగితే నదిలాగా ప్రవహిస్తూ (జీవిస్తూ) ఉండగలడు. ఇది కేవలం శారీరిక విషయమేకాదు మానసిక విషయం కూడా. మానసికంగా తమకు తాము నిమ్నస్థానంలో నిలుపుకోగలవారే పైస్థానం నుండి వచ్చే జ్ఞాన గంగను అందుకోగలరు. ఇలా మానసికంగా ఒరగడం రాని వృద్దులు (ఈ స్థాయిలో ఉన్నవారు ఏ వయసు వారైనా సరే వారు వృద్ధులే) నేర్చుకోవడానికి అసమర్ధులు. అహంకారులంతా చివరికి జీవితంలో విరిగి ముక్కలౌతారు.
ఓడటమే ఆనందం :
ఎవరైనా మిమ్మల్ని వంచడానికి వస్తే మీరు ముందే ఒరిగిపొండి. వంచేవారికి ఆ మాత్రం శ్రమ ్బడా లేకుండా చేయండి. చిన్న పిల్లవాడికి ఆడుకోవడానికి ఎవరూ లేకపోతే తండ్రితో కుస్తీ పడతాడు. తండ్రి వాడి ఆనందం కొరకు క్రింద పడిపోయి తాను ఓడినట్టుగా నటిస్తాడు. ఇలా అతడికి ఓడటంలోనే ఆనందం, గౌరవము ఉన్నాయి. లేదా పిల్లలతో పోటీ పడే సిగ్గు లేని వాడవుతాడు. గెలవదలుచున్న వారంతా మూర్ఖులే, అజ్ఞానులే, ఈ గెలుపు ఏ నాటికీ శాశ్వతం కాదని వారికి తెలియదు. కేవలం గెలుచుకున్న అహంకార సంతృప్తిలో బ్రతుకుతారు వీరు. ఆ పిల్లవాడు ఏ నాటికైనా పెద్దవాడవుతాడు (ఎదుగుతాడు) ఆనాడు ఓడింది తండ్రికాదు తానేనని తెలుసుకుంటాడు. వివేకవంతుడు ప్రకృతి ప్రవాహానికి ఎదురీదడు. ఆ ప్రవాహంలో తానూ ఒకడౌతాడు.
ముందూ - వెనుక :
మీరు అందరికన్నా ముందు నడుద్దామని ప్రయత్నిస్తే ప్రజలు మిమ్మల్ని వెనక్కు తోసేస్తారు. కానీ ఎవరైనా ఈ పిచ్చి పోటీలో పాల్గొనక ప్రశాంతంగా వెనుక నిలబడితే చాలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. ముందు నడవమని బ్రతిమిలాడతారు. ఇక్కడ వారి అహంకారాలు దెబ్బతినవు గనుక వారు మీకుహాని తలపెట్టరు.రాజకీయాలలోనైతే సింహాసనంమీద ్బర్చునే వారిని తక్కిన వారంతా క్రిందికి లాగుదామని, హాని తలపెడదామని చూస్తారు. వారికి నువ్వు ప్రతిద్వంద్వివి కావు అనే విషయం తెలిసినప్పుడు వారు మీకు ఏ హానీ చేయరు.
కానీ ఒకవేళ అందరికన్నా ముందు ఉండటం కొరకే మీరు ప్రజల వెనుక నడుద్దామని చూస్తే మాత్రం అందరికన్నా శ్రేష్ఠుడిగా గుర్తింపబడాలనే అహంకా రంతో వెనుక నిలబడటం అనే సాధనను ఆశ్రయిస్తే మాత్రం వెనుకే ఉండిపో గలరు. తనలో తాను సంతుష్టుడై గుర్తింపు కోరక వెనుక నడిచిన వారికి మాత్రం శ్రేష్ఠత్వం పరిణామంగా సిద్ధిస్తుంది.
ఆదేశం-ఉపదేశం-సందేశం-స్వతేజం :
ఆదేశాలు, ఉపదేశాలు, సందేశాలు ఎవరికీ నచ్చవు. ప్రజలు మిమ్మల్ని శ్రేష్ఠులుగా ఒప్పుకుంటే కదా మీనుండి ఇవన్నీ స్వీకరించడానికి, ప్రతివ్యక్తి అహంకారం అనే బురద పూసుకొని తనే శ్రేష్ఠుడిని అనుకుంటాడు. కనుక కలిసి జీవించదలచినవాడు ఆదేశాలు, సందేశాలు, ఉపదేశాలు ఇవ్వడం మానాలి. మీలో తేజస్సు పెరిగిననాడు మీరు తమకన్నా శ్రేష్ఠులనే విషయం వారికి అర్ధం
కాగలదు. అప్పుడు వారే మిమ్మల్ని సందేశం ఇవ్వమని అడుగుతారు. కనుక పోటీ పడటం మాని తేజస్సును పెంచుకోవడం మొదలు పెట్టండి.
ప్రేమ - బరువు :
శ్రీ రామతీర్ధ స్వామి ఒకసారి ఒక అరణ్యంలోని పర్వతం ఎక్కుతున్నప్పుడు,ఆ కాలిబాటలోనే నాలుగేళ్ళ పిల్లవాణ్ణి వీపున ఎక్కించుకొని ముందుకు సాగిపోతున్న ఎనిమిది సంవత్సరాల పాప కనిపించింది. మామూలుగా ఒక వ్యక్తి ఆ కాలిబాటలో కొండనెక్కి వెళ్ళడమే కష్టమైతే, కేవలం ఎనిమిదేండ్ల వయసు గల ఆ పాప ఆ పిల్లవాణ్ణి ఎత్తుకొని కొండ ఎక్కడం ఆయనకు ఆశ్చర్యాని కలిగించింది. ''పాపా! ఆ పిల్లవాడు నీకు బరువు కావడం లేదా?'' అన్నాడు. ఆ పాప ''వీడు నా
తమ్ముడు, మరి నాకెలా బరువవుతాడు!''అన్నదట.
తప్పని పరిస్థితిలో ఏదైనా వస్తువును నెత్తి నెత్తుకోవాల్సి వస్తే అది మనకు చాలా బరువవుతుంది. కానీ అదే మనం ఇష్టపడి ప్రేమతో ఆ బరువెత్తుకుంటే అది మనకు భారంకాదు. అలాగే మనంతట మనం ఎవరి నెత్తినన్నా ఎక్కి కూర్చుంటే వారికి బరువవుతాము. కానీ అదే వారు ప్రేమతో నెత్తి నెత్తుకుంటే (తమకన్నా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టుకుంటే) బరువయ్యే ప్రసక్తే లేదు. కనుక ప్రేమ పెంచుకోండి? ఎవరికీ బరువు కాకుండా అందరితో కలిసి బ్రతకవచ్చు.
నీడలు - ఘర్షణ :
"Then the people of the world are glad No one in the world can contend against him"
''ఆ తరువాత ప్రపంచ ప్రజలు ఆనందంగా ఉంటారు, ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ సంఘర్షణ చేయలేరు''. - తావో తెహకింగ్
రిన్ ఘాయీ అనే జెన్ తత్వవేత్త నీడలనుగురించి ఒక పాట వ్రాశారు. ''మెట్ల మీది చెట్టు నీడ చిమ్ముతోంది. (ఊడుస్తోంది) అయినా దుమ్ము లేవడం లేదు; సరస్సు మీద కొంగలు ఎగురుతున్నాయి వాటికి తమ ప్రతిబింబం నీళ్ళలో కనిపించాలని లేదు; సరస్సుకు వాటికి ప్రతిబింబించాలని లేదు అయినప్పటికీ ప్రతిబింబాలు తయారవుతూ మళ్ళీ అంతమవుతూ ఉంటాయి''. ఇలా జీవించడం నేర్చుకోండి. ఆకాశంలో ఎగిరే పక్షికి పదచిహ్నాలు ముద్రించబడవు. అలాఎవరితోనూ ఘర్షించని నీడలలాగా వర్తించినప్పుడు, సూక్ష్మ మైన హింసా వృత్తులను కూడా విడిచి పెట్టినప్పుడు పోటీ ఉండదు అప్పుడు కలిసి జీవించడం సులభమౌతుంది.

Post A Comment:
0 comments: