విజయానికి మూలం దృఢ సంకల్పం. అన్ని గుణాలు ఒకవైపు, దృఢ సంకల్పం ఒక్కటీ ఇంకొక వైపు. దృఢ సంకల్పం కలిగిన వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ, ఏ క్షేత్రంలోనూ అపజయం లేదు.

''స్వెట్‌ మార్టెన్‌'' ఇలా వ్రాస్తారు.
''ఏ నవయువకులైతే జీవితంలో తమకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోదలచి శీలవంతులు కాదలచుకున్నారో, తమలోని పౌరుషాన్నంతా పాచికలో పెట్టి జీవిత జూదం ఆడటానికి నిశ్చయించుకున్నారో వారికి యశస్సు, కీర్తి, ధనమూ లభించకున్నా వారుమాత్రం అపజయంపాలు కారు.''
సంకల్పంలో చాలా బలం ఉంది. ఎటొచ్చీ ఆ విచారధారను కార్యరూపం లోకి మలచినప్పుడే అది ప్రకటమౌతుంది. కానీ ఆలోచించడంవేరు, ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడం వేరు. కనుక మీ దృఢ సంకల్పమే మీకు అక్షయ శక్తినిస్తుంది.
మనిషిలో సుగుణాలున్నాయి, దుర్గుణాలూ ఉన్నాయి, బలమున్నది, బలహీనత కుడా ఉంది. దృఢత్వం ఉంది. పిరికితనం కుడా ఉంది. విశ్వాసం ఉంది. సందేహం కుడాఉంది. కనుక ఉన్నత శీలం కొరకు సద్గుణాలను వికసింప చేద్దాం. ధైర్యం, విశ్వాసం, ఏకాగ్రత, సహిష్ణుత, త్యాగాది గుణాలను మనం ఆదరించినప్పుడే అవి మనలో ప్రవేశిస్తాయి. మనం ధర్మం కొరకు, శీలం కొరకు,
ఇతరుల సేవ కొరకు పడే కష్టంలోనే సుఖానుభవం పొందిననాడు సంఘర్షణ యొక్క శక్తి మనలో ఉత్పన్నమౌతుంది. బద్ధకంగా అనిపించిన క్షణంలోనే మనం నడుంకట్టి పనిలోనికి వెళితే మనలో పనిచేయగల శక్తి ఉత్పన్నమౌతుంది. అప్పుడే మనం నిజమైన కర్మవీరులం కాగలం. ఆశ, లోభత్వం, మొదలైనవి మనలో పొడచూపినప్పుడే వాటిని తిరస్కరించాలి. కర్తవ్యం ఆచరించడమే నాధర్మం అని మనస్ఫూర్తిగా అనుకోగలిగిననాడు మనలో దృఢ నిశ్చయం యొక్క శక్తి వికసితమౌతుంది.
స్వార్ధానికి పరమార్ధం, లోభానికి త్యాగం, బద్ధకానికి కర్మశీలత విరోధులు. కనుక ఎప్పుడైనా మిమ్మల్ని ఏ దుర్గుణమైనా వెంటాడితే దాని విరోధి గుణాన్ని ఆహ్వానించండి. మనోవాక్కాయ కర్మలతో దాని ప్రాప్తి కొరకు ప్రయత్నించండి.
ఏ దుర్భలగుణానికి శరణివ్వడానికి ఒప్పుకోకండి. ఫలతః అది వెనక్కు తిరిగిపోతుంది. అర్ధరాత్రి ఎవరో మీ తలపుకొట్టారు ఎవరంటే పలకరు. కిటికీ గుండా చూస్తే చింతనిప్పుల్లాంటి, ఎఱ్ఱని కండ్లు, చింపిరి జుట్టు, మాసిన గడ్డం, గుబురు మీసాలు, దట్టమైన కనుబొమ్మలు, బుగ్గమీద పులిపిరిగింజ, నోట్లో బీడి, ఎత్తయిన పొట్ట, పైనుండి జారిపోకుండా బెల్టు పెట్టబడ్డ గళ్ళలుంగీ, మాసిన టీషర్టు, నల్లటి శరీరం, చేతిలో కఱ్ర దర్శన మిచ్చాయి. అయ్యా రెండోఆట సినిమా చూసి వస్తుంటే నన్నెవరో తరుముకు వస్తున్నారు. దయచేసి నాకు శరణివ్వండి అంటే మీరు అతణ్ణి లోనికి రానిస్తారా? లేదు. కర్కశంగా వెళ్ళి పొమ్మంటారు. లోపలికి రానిచ్చారా? శరణంటూ వచ్చిన ఆ దుర్గుణమై యజమానై కుర్చుంటుంది. లేక ఈ దుర్గుణాలు తలుపు కొట్టకుండానే వస్తాయని గనుక ఎవరైనా అంటే అది లోపలకు వచ్చినా నివసించడానికి అనుకూల పరిస్థితి నివ్వకండి. చీకటి, చిత్తడి, దుర్గంధభూయిష్టమైన స్థలాల్లోనే దోమలు గుడ్లు పెడతాయి. బాగావెలుతురు ఉండి గాలివీచే పొడి స్థలాల్లో గుడ్డు పెట్టవు. కనుక మీరు మీ జీవితాన్ని గంగలాగా పవిత్రంగా, నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. దానిలోకి దురాలోచనలు రాకుండా చేయండి. జీవితంలోని ఏమూలలోనూ దరిద్రత, బద్ధకం, రోగం, సందేహం, భయం మొదలైన వాటికి స్థానం ఇవ్వకండి. ఇచ్చారా అవి పురుగుల్లా మీ జీవిత కాండాన్ని తొలచి వేయగలవు.
దృఢత్వమే మిమ్మల్ని లేపి నిలబెట్ట గలుగుతుంది. మీ దృఢత్వం సంకల్పశక్తి సడలిపోయే పనిచేయకండి. అటువంటి ఆలోచనే మీ మనస్సులోకి రానివ్వకుండా చూసుకోండి. మీ జీవితమనే ఇంటికి మీరే స్వయంగా ద్వారపాలకులు. నిరంతరం మీ జీవన గృహాన్ని మీరే రక్షించుకుంటూ దుర్భలత అనే దొంగ జొరబడకుండా చూసుకోవాలి.
శీలవంతుడైన వ్యక్తి పర్వతంలా దృఢుడై ఉంటాడు. అతడి దృష్టిలో అతడి  సిద్ధాంతానికి, శీలానికి మాత్రమే విలువున్నది. ప్రపంచంలోని ధన, ధాన్య, సౌభాగ్యాల కొరకు అతడు తన శీలాన్ని బలిపెట్టడు. అతడి విజయం అందులోనే ఉంది. అతడే దృఢ సంకల్పవంతుడు, అజేయుడు, ప్రతి మనవుడు అలాగే ఉండాలి.

నోబుల్‌ బహుమతి గ్రహీత శ్రీ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఒకగీతం వ్రాశారు
''అకేలా చెలోరె'' (ఒంటరిగా సాగిపో బాటసారి) అని. అది పురుషార్ధికి ఎంతో ప్రేరణనిస్తుంది. ప్రతి వ్యక్తితన మార్గంలో ఒంటరిగానే ప్రయాణించవలసి వస్తుంది.
మీరు భయపడకండి. సిద్ధాంత ప్రియుడైన వ్యక్తి సహాయకుడి కొరకు ఎదురు చూడడు. ఒంటరిగానే తాను నిశ్చయించుకున్న మార్గంలో ప్రయాణిస్తాడు. ఎదురుగా ఉన్న సత్యమే అతడి జీవనం. మన ప్రాచీన ఇతిహాసాలలో ఎందరో మహాత్ములు కనిపిస్తారు. వారు ఏనాడూ తమ నిశ్చయం నుండి వైదొలగలేదు. రాముడి వన గమనంలో దృఢత్వం, భరతుడి భాతృభక్తితో దృఢత్వం, భీష్ముడి బ్రహ్మచర్య దీక్షలో దృఢత్వం, మనకు తెలియనివి కావు. అయినా మీరు అనవచ్చు ఇవన్నీ ఎవరు చూశారు. నిజంగా ఈరోజు కుడా అంత త్యాగం, దృఢత్వం, సాధ్యమా? అని. అయితే వినండి. ఒక ఆధునిక వ్యక్తి యొక్క ఆశా-నిరాశా, గెలుపు-ఓటముల, సంఘ ర్షణ-విజ యాల వృత్తాంతం ఎంత ప్రేరణాత్మకంగా ఉంటుందో చూడండి.
ఒక వ్యక్తి 30 ఏండ్ల నిరాశతో యుద్ధం చేస్తూ వచ్చాడు. చివరికి దానికి చిత్తుచిత్తుగా ఓడించాడు. మళ్ళీమళ్ళీ ఓడిపోతూ కుడా ధైర్యాన్ని పోగొట్టుకోలేదు. చివరికి విజయలక్ష్మి అతణ్ణి వరించింది. ఈ వ్యక్తికి 1831లో వ్యాపారంలో విపరీతమైన నష్టాలు వచ్చాయి. కూడబెట్టిన ధనం అంతా కరిగిపోయింది. వ్యాపారంలో ఎంతో ఎత్తు ఎదగాలనుకున్నా అతడు, చివరికి వ్యాపారంలో తాను రాణించనని తెలుసుకున్నాడు. కాని అపజయాన్ని అతడు ఒప్పుకోలేదు. మనస్సులో ''బయటి పరిస్థితులు మారడం ఎంతో సహజం. కానీ ఆంతరిక పరిస్థితులే నిజానికి ప్రపంచాన్ని మార్చేవి. కనుక నేను అపజయాన్ని లోపల ఒప్పుకోను. కాకపోతే వేరే క్షేత్రంలో నేను విజయం కొరకు ప్రయత్నిస్తాను'' అనుకున్నాడు. నిరాశతో నిండిన నిర్బలమైన మనస్సు పిరికితనంతో అభద్రతా భాననను ప్రేరేపిస్తుంది. కాని ఈ వ్యక్తి ఆశావాది. ఎంతో సాహసి, కార్యంలోశూరుడు,
మనోదృఢత్వంతో, విశ్వాసంతో, నేను నలువైపుల నుండి వచ్చే విపత్తులను జయిస్తాను అనుకున్నాడు కనుక ఆ క్షణంలోనే ఇక ముందు జీవితంలో తనకు ఎదురవ్వబోయే కష్టాలతో యుద్ధం చేయటానికి నిర్ణయించుకున్నాడు.
అతడు తన దేశమైన అమెరికా లెజిస్లేచర్‌ ఎన్నికల్లో నిలబడ్డాడు. ఎన్నో రకాలుగా ఎన్నికల యుద్ధానికి సంసిద్ధుడైనాడు. జనతా జనార్ధనుణ్ణి ఎన్నో రకాలుగా సేవించాడు. అందరినీ తన పక్షం చేసుకోవడం కొరకు ధర్మ మార్గాన్ని అనుసరించాడు. అతడికి తన సాఫల్యం పైన పూర్తి విశ్వాసం ఉంది...
కానీ లెజిస్లేచర్‌ ఎన్నికలలో కుడా ఓడిపోయాడు. 1832వ సంవత్సరం అతని జీవితంలో వ్యర్ధమైంది. ఆయన మళ్ళీ ఈ విధంగా ఆలోచించాడు. ''బహుశ నేను పొరపాటు చేశానేమో! నేను మళ్ళీ ఒకసారి వ్యాపారమే ఎందుకు చేయ్బడదు? అంటూ మళ్ళీ వ్యాపారం మొదలెట్టాడు.
1833లో మళ్ళీ అతనికి వ్యాపారంలో నష్టాలు వాటిల్లాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి. ఏం క్షేత్రంలో తాను రాణించగలడు? 1834లో మళ్ళీ క్రొత్త ఉత్సాహంతో, లెజిస్లేచర్‌ ఎన్నికలకు మళ్ళీ ఎన్నో ఏర్పాట్లు చేశాడు. భాగ్యదేవత 1835 లో మళ్ళీ ఆయన్ను దెబ్బకొట్టింది. ఇది ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ఆ సంవత్సరం ఆయన యొక్క ప్రియపత్ని మరణించింది. సాధారణమైన వ్యక్తి ఈ మానసిక అఘాతంతో పిచ్చివాడౌతాడు. కానీ ఆయనలో దాగున్న సాహసం, కార్యదక్షత పెరుగుతూ వెళ్ళింది. పరిస్థితులలో యుద్ధం చేస్తూ చేస్తూ 1836లో ఆయన ''స్నాయు'' రోగంతో పీడించబడ్డాడు.
అయినప్పటికీ మళ్ళీ స్పీకర్‌ ఎన్నికలలో నిలబడ్డాడు. కానీ కష్టాలు పిడుగుల్లాగా ఆయనపై ఒకదాని తరువాత ఒకటి వచ్చిపడటం మొదలెట్టాయి.
1837లో స్పీకర్‌ ఎన్నికలలో అపజయం.
1843లో ల్యాండ్‌ ఆఫీసర్‌ నియుక్తిలో అపజయం.
ఎంత భయంకరమైన మానసిక అఘాతం? అయినా ఆయన దానిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. బయటపడ్డాడు. ఆయన ఉత్సాహం, శౌర్యం ఆయనను ప్రేరేపిస్తూనే ఉన్నాయి. ఆయన ఓటమి నొప్పుకోలేదు. అయినా ఓటములధార ఆగనూ లేదు. 1846 కాంగ్రెస్‌ ఎన్నికలలో అపజయం. 1848లో మళ్ళీ కాంగ్రెస్‌ ఎన్నికల్లో అపజయం. అయినా వెనుకాడలేదు. 1855 సెనేట్‌ ఎన్నికలలో మళ్ళీ అపజయం.ఆయన వికట పరిస్థితులకు లొంగలేదు. భయపడలేదు. ఈసారి వైస్‌ ప్రెసిడెంట్‌ పదవి కొరకు పోటీ చేశాడు.
1856 వైస్‌ప్రెసిడెంట్‌ ఎన్నికలలో కుడా అపజయం ఆయన తన సర్వస్వాన్నీ వదులుకోవడానికి సిద్ధమేకాని, కర్కశ పరిస్థితులకు తల ఒగ్గడానికి సిద్ధంగా లేడు.ధైర్యాన్నిచిక్కబట్టుకొని పూర్తి బలాన్ని ఉపయోగించి యుద్ధం చేస్తున్నాడు.తనలోనే కాదు తన చుట్టు ప్రక్కల వారందరిలోను వీరత్వాన్ని మేల్కొలుపుతున్నాడు.
మరల 1858లో సెనేట్‌ ఎన్నికలలో అపజయం. అతడికి సంఘర్షణలోనే 27 సంవత్సరాలు గడిచిపోయాయి. కాని ఆయన సాహసం బీటలువారలేదు. ఆయన స్థానంలో ఇంకే వ్యక్తయినా ఉంటే ఈ పాటికి
వెయ్యి ముక్కలయ్యేవాడు, కాని విజయాపేక్షలో ఆయన ఇంకా నిలచి ఉన్నాడు. సమయం మారుతోంది. ఇప్పుడు పరిస్థితులు అతనివైపు మొగ్గ చూపు తున్నాయి. స్వావలంబనపై విశ్వాసం చూపబడుతోంది.
ఆయన గెలిచాడు. విజయలక్ష్మి ఆయన్ను వరించింది. 1860లో ప్రెసిడెంట్‌ ఎన్నికల్లో ఆయన గెలుపొందాడు. ఉన్నతమైన పదవి ఆయనకు ప్రాప్తించింది. 30 ఏండ్లు నిరాశా ఊయలలో ఊగినప్పటికీ ఇప్పుడు ఆశాజ్యోతి వెలిగింది. సంపూర్ణ విజయం ఆయనదైంది.
సార్వజనిక సన్మానం, యశస్సు ఆయన్ను వరించాయి. ఇంతకు ఈ విజయం వైజయంతీ పతకాన్ని ఎగురవేసింది ఎవరంటారు? ఇతడు ఒక మామూలు గ్రామీణ యువకుడు. ఈ సాహసి ఇచ్ఛాశక్తితో తనను ఆవరించిన కష్టాలనే తుఫానులను ఛిన్నాభిన్నం చేశాడు.ఈయన ఏనాడు తన దౌర్భాగ్యం ముందు ఓటమిని ఒప్పుకోలేదు. దృఢ ఆత్మవిశ్వాసాన్ని చేతికర్రగా చేసుకొని, నిత్యనూతన ఉత్సాహంతో జీవనమార్గంలో ముందుకు నడుస్తూ వెళ్ళాడు. ఆయనే అమెరికన్‌ పూర్వ రాష్ట్రపతి. ''అబ్రహం లింకన్‌''
ఒక నిముషం ఆలోచించండి. ఒకవేళ ఆవ్యక్తి ఒకటి రెండు కష్టాలకే గనక ఓటమి నొప్పకుంటే, భయభీతుడై సాహసాన్ని విడిచిపెడితే, 30 సంవత్సరాల తరువాత ఇంతకీర్తి యశస్సు, సన్మానాలు పొందగలడా? మరిమీరు చిన్న పరాజయానికే కష్టానికే నిరాశపడతారెందుకు?
సాహసవంతులు కండి, సాహసం యొక్క వ్యాపకార్ధాన్ని తెలుసుకోండి.

''ప్రాంచో అగామనృత యేహసాయ'' (అధర్వవేదం) గుర్తుంచుకోండి.
ఈ జీవితం నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ జీవించడం కొరకే ఉంది. భయం, శోకం, క్రోధం, నిరాశ మొదలైన వాటిలో పడి ఉండటం మహా మూర్ఖత్వం.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: