పని ప్రదేశాల్లో నవ్వు- అనే విషయం మీద జరిపిన అధ్యయనాలు పనిగంటల్లో కనీసం పది నిమిషాలు హాస్యస్ఫోరక మాటలు, జోకులకు కేటాయించిన కంపెనీలు మంచి ఫలితాలను సాధించాయని చెబుతున్నాయి. పనిచేయకుండా అదేపనిగా నవ్వుతూ ఉండమని చెప్పటం కాదు కానీ, కాస్త నవ్వు, ఉత్సాహం, ఉల్లాసం కలుపుకుంటే మీ ఆఫీసు పని సజావుగా సాగుతుంది.
- పనికి సంబంధించిన ఏ విషయమయినా టీమ్ లోని ప్రతి ఒక్కరితో చర్చించండి. వివరాలు అందరికీ తెలిసేలా చూడండి. ప్రతిరోజు పని ప్రారంభించే ముందు టీమ్ లోని సభ్యులందరూ కూర్చుని ఆరోజు చేయాల్సిన పని గురించి చర్చించుకోండి.
- అదేపనిగా సీరియస్ గా పనిచేస్తూ పోతుంటే బుర్ర వేడెక్కిపోతుంది. అపుడప్పుడూ సందర్భాన్నిబట్టి హాస్యాన్ని ఆస్వాదించండి. పని ఒత్తిడి తెలియకుండా ఉంటుంది. ఎంత పనయినా అలవోకగా చేయగలుగుతారు.
- నెలలో సాధించదలుచుకున్న లక్ష్యాన్ని చేరుకున్నందుకు, సహోద్యోగి పుట్టినరోజు, పెళ్ళిరోజు ... ఇలా ఏదో ఒక సందర్భాన్ని బట్టి అందరూ కలిసి వేడుక చేసుకోవడంవల్ల టీమ్ లోని సభ్యుల మధ్య మంచి అనుబంధాలు పెరుగుతాయి. ఆ ప్రభావం చేసే పనిమీద పడి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
- రోజుమొత్తం ఆశావహ దృక్పథంతో ఉండేలా అలవాటు చేసుకోండి. ఆందోళన పనిచేసే శక్తిని తగ్గిస్తుంది. పని విషయంలో వచ్చే సమస్యలను తోటివారితో చర్చించి, సమస్యకు ఉన్న అన్ని కోణాలను పరిశీలించి పరిష్కరించు కోవడానికి ప్రయత్నించండి.
- బాగా ఒత్తిడితో గడిచిన రోజున పడుకునే ముందు చల్లటి నీటితో స్నానం చేసి, మంచి పుస్తకాన్ని చదువుతూ పడుకోండి. ఒక మంచి పుస్తకం మీ అలసటను పోగొట్టి మీ మెదడును చురుకుగా తయారుచేస్తుంది.
- తోటి ఉద్యోగస్తులకు, స్నేహితులకు సహాయం చేసే స్వభావాన్ని పెంపొందించుకోండి. వారిని ఆందోళనకు గురిచేసే సందర్భలు, సమస్యలు వచ్చినపుడు మీరు కనీసం మాటసహాయం ద్వారానయినా కొంత ఉపశమనాన్ని ఇస్తున్నారన్న నమ్మకాన్ని వారికి కలిగేలా ప్రవర్తించండి.
- ఉద్యోగ జీవితానికి, కుటుంబ జీవితానికి స్పష్టమయిన విభజన రేఖ గీసుకోండి. మీరు చేసే పనిని పూర్తిగా మీ సొంత విషయంగా భావించి పూర్తి సమయాన్ని దానికే కేటాయించడం వల్ల కుటుంబ జీవితం దెబ్బతినడమే కాకుండా, ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య మంచి సమన్వయాన్ని సాధించడానికి ప్రయత్నించండి.
- పనిలో పడి విషయాలను మరచిపోకుండా ప్రతిరోజు మీరు చేయాల్సిన పనుల వివరాలు రాసి మీ దృష్టి తరచుగా పడే ప్రదేశంలో ఆ కాగితాన్ని అతికించండి. అందులో రోజువారి కార్యక్రమాల వివరాలతో పాటు స్నేహితులతో సినిమాకు వెళ్లడం, పిల్లలను పార్కుకు తీసుకువెడతానన్న విషయాలను కూడా చేర్చండి.
- విమర్శలను స్వీకరించటం అలవాటు చేసుకోవాలి. లేదంటే అదేదో ఊహించని పరిణామంలా మానసిక అశాంతికి గురవుతారు. మీరు చేసే పనిలో ముందుకు దూసుకు పోవాలంటే భయాన్ని విడనాడాలి. అలాంటి భయాలు మీలో ఒత్తిడిని పెంచి చేస్తున్న పనిలో మీకు ప్రశాంతత, ఆనందం దక్కకుండా చేస్తాయి.

Post A Comment:
0 comments: